ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రధాన బ్యాంకులు, మీడియా సంస్థలు, విమానయాన సంస్థల ఐటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో వేలాది విమానాల రాకపోకలు రద్దు అయ్యాయి. బ్యాకింగ్, ఆరోగ్యరంగాలలో ఇబ్బందులు తలెత్తాయి.
ప్రపంచ వ్యాప్తంగా 3340 విమానాలు రద్దు అయ్యాయి.
సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందని ఐటీ అంతరాయాలకు కారణమైన సైబర్ సెక్యూరిటీ అంగీకరించింది.
ఈ సమస్యకు కారణమేంటో కేంద్ర ఐటీ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) వెల్లడించింది. క్రౌడ్‌స్ట్రైక్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ‘ఫాల్కన్ సెన్సర్’ అనే సాఫ్ట్‌వేర్‌లో లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని తెలిపింది. ఈ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన ‘అప్‌డేట్’ వల్ల ఈ సమస్య వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ సమస్యను అత్యంత తొందరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ సీఈవో జార్జ్ కర్ట్జ్ తెలిపారు. విండోస్ సర్వర్లలో మాత్రమే ఈ సమస్య వచ్చిందని, మ్యాక్, లినక్స్ సర్వర్లపై ఎలాంటి ప్రభావం లేదని చెప్పారు.

ఇలా చేయాలి..
సమస్య పరిష్కారానికి ఇలా చేయాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఈ సూచనలు చేసింది.
- విండోస్ సర్వర్ కంప్యూటర్‌ను సేఫ్ మోడ్ లేదా విండోస్ రికవరీ ఎన్విరాన్మెంట్‌లో బూట్ చేయాలి.
- C:\Windows\System32\drivers\CrowdStrike ఫోల్డర్‌లోకి వెళ్లి “C-00000291*.sys” అనే పేరుతో ఉన్న ఫైల్‌ను డిలీట్ చేయాలి.
- తర్వాత సర్వర్ కంప్యూటర్‌ను సాధారణంగా బూట్ చేయాలి.

దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ఇలా బోర్డుపై విమానాల రాకపోకల వివరాలను రాశారు
క్రౌడ్‌స్ట్రైక్, ఫాల్కన్ సెన్సర్ ఏంటి?
క్రౌడ్‌స్ట్రైక్ అనేది అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సాంకేతికతను అభివృద్ధి చేసే సంస్థ. టెక్సస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. సైబర్ దాడులను అడ్డుకునేందుకు ఈ సంస్థ అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్లలో ‘ఫాల్కన్ సెన్సర్’ ఒకటి. ఈ సాఫ్ట్‌వేర్‌లోనే ఇప్పుడు సమస్య వచ్చింది.
ఈ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ఇటీవల ఒక ‘అప్‌డేట్’ను విడుదల చేసింది. అది అప్‌డేట్ చేసిన తర్వాత ఆయా సర్వర్ కంప్యూటర్లు క్రాష్ అవుతున్నాయని, బ్లూ స్క్రీన్ వస్తోందని బాధితులు చెబుతున్నారు.
13 ఏళ్ల కిందట స్థాపించిన క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ సైబర్ సెక్యూరిటీ సేవల్లో గుర్తింపు తెచ్చుకుంది. తమకు సుమారు 29,000 వినియోగదారులు (కంపెనీలు లేదా వ్యక్తులు) ఉన్నారని ఈ సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా సమస్య
ఐటీ సమస్య కారణంగా దిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు నిలిచిపోయాయి. యునైటైడ్ ఎయిర్‌లైన్స్ విమానాలు కూడా తిరగడం లేదు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సేవలకూ అంతరాయమేర్పడింది.
బెర్లిన్ విమానాశ్రయంలోనూ విమానాల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి.
యూకేలో స్కై న్యూస్ చానల్ ప్రసారాలు ఆగిపోయాయి. ఆస్ట్రేలియాకు చెందిన టెలికమ్యూనికేషన్స్ సంస్థ టెల్‌స్ట్రా కూడా ఈ ప్రభావానికి లోనయినట్లు ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా కలిగిన ఈ అంతరాయం ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపిందని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో అనేక మంది తమ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై బ్లూస్క్రీన్ మాత్రమే కనిపిస్తోందంటూ ట్వీట్లు చేస్తున్నారు.
దీనివల్ల బ్యాంకులు, ఇతర అనేక సంస్థల్లో కార్యకలాపాలపై ప్రభావం పడింది.
కాగా భారత్‌లోనూ కొన్ని సంస్థలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రకటించాయి.
ముఖ్యంగా విమానయాన సంస్థలు దీనిపై స్పందించాయి.
స్పైస్ జెట్ ఇప్పటికే ఎక్స్ వేదికగా దీనిపై ప్రకటన చేసింది. బుకింగ్స్, చెక్ఇన్‌లో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నామని..అందుకే మాన్యువల్ చెక్ ఇన్‌కి తాత్కాలికంగా మారామని పోస్ట్ చేసింది.
ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా మైక్రోసాఫ్ట్ అవుటేజ్ వల్ల తమ కంప్యూటర్లపై ప్రభావం పడిందని, బుకింగ్, చెక్ ఇన్‌లలో సమస్యలు ఏర్పడడంతో పాటు ఇతర విమాన సేవలపైనా ప్రభావం పడుతోందని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తాజా పరిణామాలపై స్పందిస్తూ.. ప్రయాణికుల సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చని.. ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని సూచించింది.
అంతర్జాతీయంగా ఏర్పడిన ఐటీ అవుటేజ్ కారణంగా సమస్యలు ఎదురవుతున్నట్లు పేర్కొంది.
మంత్రి రామ్మోహన్ నాయుడు ఏమన్నారు?
దేశంలోని పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం, కలుగుతోందని, కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.